: కోటక్ మహీంద్ర బ్యాంకు ఏటీఎంలో నోట్ల వెల్లువ..పండగ చేసుకున్న జనాలు
ఏటీఎంల ముందు రోజంతా నిలబడినా రూ.2.5 వేలే వస్తున్నాయని బాధపడిన ఖాతాదారులు నిన్న పండగ చేసుకున్నారు. రూ.వందకు బదులు రూ.500 వస్తుండడంతో సంబరపడిపోయారు. దీంతో అరగంటలో ఏటీఎం నుంచి ఏకంగా రూ.8 లక్షలు డ్రా అయిపోయాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కోటక్ మహీంద్ర బ్యాంకు ఏటీఎంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన బ్యాంకు సిబ్బంది ఏటీఎంను ఆపేశారు.
ఎయిర్‌పోర్టు రెండో అరైవల్ గేటు సమీపంలో ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు ఓ ప్రయాణికుడు వెళ్లాడు. రూ.2500 డ్రా చేసేందుకు కావాల్సిన ఆప్షన్లు ఎంచుకున్నాడు. ఒక రూ.2000 నోటు, ఐదు రూ.100 నోట్లు రావాల్సి ఉండగా ఒక రూ.2 వేల నోటు, ఐదు రూ.500 నోట్లు వచ్చాయి. దీనిని గమనించిన మిగతా వారు కూడా రూ.2500 డ్రా చేశారు. వారికీ అలాగే రావడంతో ఆ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు జనాలు ఎగబడ్డారు. ఇలా అరగంటలోనే ఏకంగా రూ.8 లక్షల వరకు ఏటీఎం నుంచి డ్రా చేశారు. చివరికి విషయం తెలిసిన బ్యాంకు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఏటీఎంను బంద్ చేశారు.