: బ్యాంకుల్లో డబ్బులెయ్యగానే అంతా అయిపోయినట్టు కాదు...ఇదే ఆరంభం!: మోదీ
డిసెంబర్ 30 తరువాత నల్లకుబేరుల కష్టాలు పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు. ముంబైలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నల్ల కుబేరులు బ్యాంకుల్లో డబ్బులు జమచేయడంతో సమస్యలు ముగిసిపోయినట్టు కాదని, అసలు సమస్య ప్రారంభానికి అదే నాంది అని అన్నారు. అదే సమయంలో నీతిపరుల కష్టాలు క్రమంగా తగ్గుతాయని ఆయన చెప్పారు.
నల్లకుబేరులు కుయుక్తులతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు బ్యాంకు సిబ్బందిని కూడా బలిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేయడంతో సమస్యలు తీరిపోయాయని భావించవద్దని ఆయన హెచ్చరించారు. చట్టంలో లొసుగులతో ఎలాగోలా తప్పించుకోవచ్చని భావిస్తున్నారని, అయితే వారంతా తెలుసుకోవాల్సిందేంటంటే, కేంద్రంలో ఉన్నది మోదీ సర్కారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులేయడంతోనే పని అయిపోలేదని, నల్లకుబేరుల అసలు కష్టాలకు అదే ప్రారంభమని ఆయన తెలిపారు. కొందరు నల్లకుబేరుల కారణంగా దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.