: పూణేలోని ఎన్ఐబీఎంలో దూరిన చిరుత.. బెంబేలెత్తిన ఉద్యోగులు.. తంటాలు పడ్డ అటవీశాఖాధికారులు!
పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్ మెంట్ (ఎన్‌ఐబీఎం) క్యాంపస్ లోకి దూరిన చిరుత అందర్నీ బెంబేలెత్తించింది. మూడేళ్ల వయసున్న చిరుత తెల్లవారు జామున క్యాంపస్ లో దూరి, ఓ చిన్నగదిలో నక్కింది. దీనిని ఓ మహిళా ఉద్యోగి గుర్తించారు. ఆమె అలికిడి విన్న చిరుత అదే భవంతిలోని మరో గదిలోకి వెళ్లింది. అప్పటికే చిరుతను చూసిన ఆ మహిళ ధైర్యంతో ఆ గది వద్దకు మెల్లగా వెళ్లి దాని తలుపు గడియ వేసేసింది.
తర్వాత నేరుగా సెక్యూరిటీ సిబ్బంది, పరిపాలనా సిబ్బందికి విషయం వివరించింది. దీంతో క్యాంపస్ కలకలం చెలరేగింది. దీంతో చిరుత ఓ టేబుల్ కిందికి వెళ్లి దాక్కుంది. ఇంతలో క్యాంపస్ యాజమాన్యం అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి ఆ గది కిటికీ అద్దాలు పగులకొట్టి దానికి మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అది టేబుల్ కిందికి చేరుకోవడంతో మత్తుమందు ఇవ్వడానికి నానాతంటాలు పడాల్సి వచ్చింది. ఎట్టకేలకు మూడు గంటల తరువాత మత్తుసూది షూట్ చేయగలిగారు. అనంతరం చిరుతను సురక్షితంగా అక్కడి నుంచి అడవిలోకి తీసుకెళ్లారు.