u.p: ఇదో మిరకిల్: చనిపోయిందనుకొని ఆమెను గంగా నదిలో పారేశారు... 40 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చింది!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సినిమా సీన్లను గుర్తుచేసేలా ఇటీవలే ఓ అద్భుత సంఘటన చోటుచేసుకుంది. నమ్మశక్యం కాని ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిందని అందరూ భావించిన విలాస అనే ఒకావిడ 40 సంవత్సరాల తరువాత మళ్లీ తన సొంత గ్రామంలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఇప్పుడు ఆమెకు 82 ఏళ్లు. 40 ఏళ్ల క్రితం(1976లో) విలాస పశుగ్రాసం కోసం తన గ్రామానికి సమీపంలోని అడవికి వెళ్లింది. అయితే, అడవిలో ఆమెను పాము కాటు వేయడంతో ఆమెకు నాటు వైద్యం చేయించారు. నాటు వైద్యం పనిచేయకపోవడంతో ఆమె కోలుకోలేదు. ఇక ఆమె మరణించిందని అనుకొని ఆమెను స్థానికంగా వున్న గంగా నదిలో పడేశారు. అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించి వెళ్లారు.
అయితే, నదిలో కొట్టుకుపోతున్న ఆమెను జాలర్లు కాపాడారు. స్పృహలో లేని ఆమెకు వైద్యం అందించారు. అయితే, ఆమె స్పృహ లోంచి బయటకు వచ్చినప్పటికీ తన గతం మర్చిపోయింది. దాంతో వారి దగ్గరే ఉండిపోయింది. ఇటీవలే ఆమెకు తన గతం పూర్తిగా గుర్తుకొచ్చింది. తనవాళ్ల గురించి ఓ బాలికకు చెప్పింది. ఈ విషయాన్ని ఆ బాలిక తన బంధువుకు చెప్పింది. దీంతో పలువురు ఆమె వద్దకు వచ్చి ఆమె గురించిన వివరాలు తెలుసుకొని సొంత గ్రామానికి పంపించారు. ఇప్పుడు ఆమె తన కుమార్తెలను కలుసుకుంది. విలాసకు 82 ఏళ్లు వచ్చినప్పటికీ ఆమెకు ఉన్న పుట్టుమచ్చల ఆధారంగా ఆమె కుమార్తెలు తమ తల్లిని గుర్తించారు. ఇన్నేళ్ల తరువాత తమ తల్లిని తిరిగి కలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.