: విద్యార్థులను చితకబాదిన శ్రీచైతన్య కాలేజీ లెక్చరర్ పై కేసు
ఇంటర్ విద్యార్థులను చావగొట్టిన లెక్చరర్ పై హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ దొరబాబు మార్కుల్లో వెనుకబడిన 15 మంది విద్యార్థులపై గురువారం కర్రతో విరుచుకుపడ్డాడు. ఇతడి దారుణమైన శిక్ష కారణంగా పలువురు గాయపడ్డారు. లెక్చరర్ రాక్షసత్వాన్ని విద్యార్థుల్లో ఒకరు వీడియో తీయడంతో దీనిపై బాలల హక్కుల సంఘం ప్రతినిధి, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ సభ్యుడు అచ్యుతరావు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు విద్యార్థుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఓ స్వచ్చంద సంస్థ ఫిర్యాదు మేరకు వీడియోను చూసిన తర్వాత లెక్చరర్ దొరబాబుపై కేసు నమోదు చేశామని ఎస్ ఆర్ నగర్ పోలీసు ఇన్ స్పెక్టర్ వహీనుద్దీన్ తెలిపారు.