: అంత్యక్రియలకు అవసరమని చెప్పినా డబ్బు ఇవ్వని బ్యాంకు.. గ్రామస్తుల సాయంతో అంతిమసంస్కారాలు!
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత బ్యాంకుల్లో ఖాతాదారులకు కొంత మొత్తంలోనే డబ్బు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జార్ఖండ్లోని లాతేహార్ జిల్లా బ్రిష్ రాంపుర్కు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి తన భార్య అంత్యక్రియలు నిర్వహించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకు సిబ్బంది నగదు ఇవ్వకపోవడంతో గ్రామస్తుల సాయంతో చివరకు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. వివరాలు చూస్తే.. జ్యుయర్ కాజూర్ అనే వ్యక్తి భార్య హీరామని కాజూర్ మొన్న కన్నుమూసింది. ఆమెకు అంతిమసంస్కారాలు చేయడానికి అతడికి రూ.10వేల అవసరం పడ్డాయి.
అందుకోసం కాజూర్ తన మేనల్లుడిని వెంటపెట్టుకొని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు వెళ్లగా, 10 వేల రూపాయలు ఇవ్వడానికి ఆ బ్యాంకు క్యాషియర్ నిరాకరించారు. తన భార్య చనిపోయిందని చెప్పినప్పటికీ కాజూర్‌కు రూ.4000 మాత్రమే ఇచ్చారు. చేసేదేమీ లేక బ్యాంకులో ఇచ్చిన నగదునే తీసుకుని కాజూర్ ఇంటికివెళ్లాడు. తనకు అవసరమైన డబ్బు దొరకలేదని గ్రామస్తులకు చెప్పి బాధపడిపోయాడు. దీంతో స్థానికులు తలాకొంచం డబ్బు వేసుకొని కాజూర్ భార్య అంత్యక్రియలు జరిగేలా చూశారు. గ్రామస్తులు తనకు చేసిన సాయానికి వారికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన వ్యాఖ్యానించాడు. తన డబ్బు తనకు అందిన వెంటనే దాన్ని గ్రామస్తులకు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. తన డబ్బుని తనకి ఇవ్వనప్పుడు ఇక బ్యాంకులో డబ్బు జమ చేసుకోవడం వల్ల ఫలితం ఏముందని ఆయన ప్రశ్నించాడు.