: ఆధార్ నంబర్ ఉందా...? కార్డులు, నోట్లతో పనిలేదు... వచ్చేస్తోంది సరికొత్త యాప్


డెబిట్ కార్డు అక్కర్లేదు. క్రెడిట్ కార్డుతోనూ పనిలేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోయినా ఫర్వాలేదు. డిజిటల్ వ్యాలెట్ అసలే అవసరం లేదు. చివరిగా పర్స్ లో నోట్లు కూడా ఉండక్కర్లేదు. కానీ, ఒక్క బ్యాంకు ఖాతా ఉంటే చాలు. ఆ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ ను లింక్ చేసి ఉంటే చాలు. నిమిషంలో దుకాణంలో నగదు చెల్లించవచ్చు. ఇదే ఆధార్ అనుసంధానిత యాప్. ఈ సరికొత్త యాప్ ను కేంద్ర సర్కారు క్రిస్ మస్ రోజున విడుదల చేయనుంది.

దుకాణదారులు ఆధార్ క్యాష్ లెస్ మర్చంట్ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, రూ.2,000 ఖరీదు చేసే బయోమెట్రిక్ రీడర్ మెషిన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది వేలిముద్రలను గుర్తించే పరికరం అన్నమాట. ఈ మెషిన్ ను తన ఫోన్ కు అనుసంధానించుకోవాలి. ఏదైనా కొనుగోలు చేసిన తర్వాత దుకాణదారుడి వద్దనున్న ఆధార్ యాప్ లో కస్టమర్ తన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. బ్యాంకు పేరును సెలక్ట్ చేయాలి. ఆ తర్వాత బయోమెట్రిక్ రీడర్ పై వేలిని ఉంచితే చాలు లావాదేవీ పూర్తయినట్టే. వేలిముద్రను స్కాన్ చేసిన తర్వాత అది ఆధార్ డేటాతో పోల్చుకుంటుంది. సరిగ్గానే ఉన్నట్టయితే బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీకి సరిపడా నగదు దుకాణదారుడి ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఎలాంటి పాస్ వర్డ్ లు, పిన్ నంబర్లు గుర్తుంచుకోవాల్సిన ఇబ్బంది కూడా లేదని యూఐడీఏఐ సీీఈవో అజయ్ భూషణ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు.

సుమారు 40 కోట్ల ఆధార్ నంబర్లు బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉన్నాయని ఆయన చెప్పారు. మొత్తం వయోజనుల్లో సగం సంఖ్యకు ఇది సమానమని, మొత్తం అన్ని ఖాతాలను ఆధార్ నంబర్ తో మార్చి నాటికి అనుసంధానించాలని అనుకుంటున్నామని అజయ్ భూషణ్ తెలిపారు. ఐడీఎఫ్ సీ బ్యాంకు, యూఐడీఏఐ, ఎన్ పీఐ ఈ ఆధార్ యాప్ ను రూపొందించాయి. 

  • Loading...

More Telugu News