: లీటర్ పెట్రోల్ రూ.300... గ్యాస్ సిలిండర్ రూ.3,000... మణిపూర్ లో పరిస్థితి ఇదీ...
లీటర్ పెట్రోల్ రూ.300... గ్యాస్ సిలిండర్ రూ.3,000... ఎక్కడో కాదు మన దేశంలోని మణిపూర్ లో పరిస్థితి ఇదీ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో ఇప్పుడు సామాన్యులు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసరాలన్నీ మండిపోతున్నాయి. 50 రోజులుగా కొనసాగుతున్న ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధనంతో ఇంఫాల్ కు వెళ్లే ట్రక్కులన్నీ జాతీయ రహదారులు 37, 2పై నిలిచిపోయాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది.
నాగాలు, ఇతర వర్గాల మధ్య జాతి ఘర్షణలు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నవే. ఈ రాష్ట్రంలో నాగాల జనాభా 20 శాతం కాగా, మీతీస్ 65 శాతంగా ఉన్నారు. కుకి చిన్ వర్గం జనాభా 13 శాతం. కొత్తగా ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జిరిబామ్ ప్రాంతాన్ని, సేనాపతి జిల్లాలోని కంగ్ పోక్పి లను రెండు కొత్త జిల్లాలుగా చేయనున్నట్టు గత అక్టోబర్లో మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది నాగాలకు రుచించలేదు. సేనాపతి జిల్లా తమ పూర్వీకుల స్వస్థలమని, దాన్ని విడగొట్టడానికి వీల్లేదంటూ వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నవంబర్ 1న నాగా కౌన్సిల్ ఆర్థిక దిగ్బంధనానికి దిగింది.
అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాలేదు. డిసెంబర్ 8న ఏడు కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రకటించేసింది. దీంతో ఇంఫాల్ వ్యాలీలో ఘర్షణలు తలెత్తాయి. ఫలితంగా ఈ నెల 18న కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నాగాల దిగ్బంధనంతో మొత్తం ఏడు జిల్లాల్లో ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సాయం కోరింది. అదనపు బలగాలను పంపాలని కోరింది. క్రిస్మస్ వేడుకలపైనా ఈ ప్రభావం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.