sagorate: 67 ఏళ్ల వయసులో బిడ్డను కని రికార్డు నెలకొల్పిన వృద్ధురాలు!
గ్రీస్‌లో 67 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చి ప్రపంచంలోనే అత్యంత పెద్దవయసులోని సరొగేట్ తల్లిగా రికార్డు నెలకొల్పింది. ఏడున్నర నెలల గర్భం అనంతరం ఆమెకు ఇటీవలే సిజేరియన్ చేసిన డాక్టర్లు ఆడ శిశువును బయటకు తీశారు. అనస్టాసియా ఓంటు అనే ఆ వృద్ధురాలికి పుట్టిన ఆ బిడ్డ 1.2 కిలోల బరువుంది. మధ్య గ్రీస్‌లోని లారిసా అనే గ్రామానికి చెందిన అనస్టాసియా ఓంటు తాను గర్భం దాల్చిన సమయంలో పలు సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పింది. ఆమె ఈ వయసులో ఈ సాహసం చేయడానికి ఓ కారణం ఉంది.
ఆమె కూతురు కాన్‌స్టాంటినా (43) కేన్సర్ కారణంగా 2009లో మృతి చెందింది. తన కూతురు కాన్‌స్టాంటినా ఏడు సార్లు గర్భం దాల్చిందని అయితే, పలు సమస్యల కారణంగా ఏడు సార్లు పిల్లల్ని కనలేకపోయిందని అనస్టాసియా చెప్పింది. తన కూతురు చనిపోవడానికి ముందు ఆమెకు అనస్టాసియా ఓ మాట చెప్పింది. బిడ్డలు లేరని బాధపడకూడదని తన కూతురి బిడ్డకు తాను తల్లినవుతానని చెప్పింది. ఇప్పుడు సరొగేట్ తల్లిగా బిడ్డను కన్నానని చెప్పింది. తాను కన్న ఆ బిడ్డకు తాను తల్లిగా కాకుండా అమ్మమ్మలా భావిస్తున్నానని చెప్పింది. ఇది ప్రత్యేకమైన కేసు కావడంతో ఆమె గర్భం దాల్చడానికి కోర్టు కూడా అనుమతి తెలిపింది.