: దయనీయ స్థితిలో స్వాతంత్ర్య సమరయోధుడు.. తల్లిదండ్రులను బస్టాండ్‌లో వదిలివెళ్లిన కుమారుడు
కారణాలు ఏవైతేనేం.. మనిషిలోని 'మనిషి' మాయమైపోతున్నాడు. రక్తసంబంధాల్ని వదిలేసుకుంటున్నాడు. కనీపెంచిన తల్లిదండ్రులనైనా భారంగా మారితే వదిలించుకుంటున్నాడు. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగిన సంఘటన పలువురితో కన్నీరు తెప్పించింది. మండలంలోని పసరుగొండ గ్రామానికి చెందిన ఆకుల ఐలయ్య స్వాతంత్ర్య
సమరయోధుడు. ఆయన భార్య వీరలక్ష్మి. ఐలయ్యకు నెలకు రూ.26 వేల చొప్పున పింఛను కూడా వస్తోంది. వీరికి ముగ్గురు కొడుకులు. ప్రస్తుతం ఐలయ్య దంపతులు కరీంనగర్‌లో చిన్నకొడుకు రాజ్‌కుమార్ వద్ద ఉంటున్నారు.
గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను పదిరోజుల క్రితం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చారు. అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆస్పత్రికి ఆటో తీసుకొచ్చిన కొడుకు రాజ్‌కుమార్ తల్లిదండ్రులను అందులో ఎక్కించుకుని జయశంకర్ జిల్లాలోని ములుగు బస్టాండ్‌లో వారిని వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం చలిలో వణుతుకున్న వృద్ధ దంపతులను గమనించిన ఉపాధ్యాయుడు సురేష్ వారిని 108 అంబులెన్స్‌లో ములుగు ఆస్పత్రికి తరలించారు.
చికిత్స తర్వాత తేరుకున్న వృద్ధులు ఇచ్చిన సమాచారంతో కుమారుడు రాజ్‌కుమార్‌కు సమాచారం అందించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆస్పత్రికి చేరుకున్న రాజ్‌కుమార్‌ను కలిసిన ములుగు ఎస్సై తల్లిదండ్రులను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో వృద్ధులను వరంగల్‌లోని సహ్రుదయ వృద్ధాశ్రమంలో చేర్చారు.