: అవయవదానానికి ముందుకొచ్చిన ఇంద్రాణి ముఖర్జియా.. ఆస్తిలో 75 శాతం విరాళం ఇస్తానని ప్రకటన!
కుమార్తె షీనాబోరా హత్యకేసు నిందితురాలు ఇంద్రాణియా ముఖర్జియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నకూతురునే అత్యంత అమానుషంగా కడతేర్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె అవయవదానం చేయాలని, ఆస్తిలో 75 శాతం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కుమార్తె హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె కోర్టు ముందు రెండు వినతులు ఉంచారు. తన అవయవాలను దానం చేయడంతోపాటు ఆస్తిలో 75 శాతం వాటాను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు తెలిపారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి హెచ్ఎస్ మహాజన్ మాట్లాడుతూ ఆస్తులు విరాళంగా ఇవ్వడానికి కోర్టు అనుమతి అవసరం లేదని తెలిపారు.
ఈ సందర్బంగా ఇంద్రాణియా మాట్లాడుతూ, జైలులో ఖైదీల కష్టాలు చూసి చలించిపోయానని తెలిపారు. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడతానో లేక ఉరిశిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందో తనకు తెలియదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. తాను దానం చేసే ఆస్తిలో సగం ఇస్కాన్ సంస్థకు, మిగిలిన దానిని స్త్రీ, బాలల సంక్షేమ సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఇంద్రాణియా భర్త పీటర్ ముఖర్జియా మాత్రం తన అవయవాలను దానం చేసేది లేదని కోర్టుకు తెలిపారు.