: తమిళనాట చిన్నమ్మ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు!
తమిళ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు నష్టం చేకూర్చేలా ఉండడంతో పాటు, వ్యక్తిగత సమస్యలు తెచ్చేలా తయారు కావడంతో అన్నాడీఎంకే నేతలు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న అనిశ్చితికి స్వస్తి చెప్పాలని నిర్ణయించారు. దీంతో జయలలిత నెచ్చెలి, చిన్నమ్మగా పేరు తెచ్చుకున్న శశికళకు పట్టాభిషేకం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీన అన్నాడీఎంకే కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది.
దీంతో ఈ నెల 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, పురచ్చితలైవి జయలలితకు అచ్చొచ్చిన నగరంలోని ‘శ్రీవారి కల్యాణమండపం’లోనే ఈ సమావేశాలను నిర్వహించనున్నామని జిల్లా కార్యదర్శులు తెలిపారు. కార్యవర్గంలోని 280 మంది, సర్వసభ్య కార్యవర్గంలోని 2,770 మంది సభ్యులంతా తప్పనిసరిగా దీనికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆహ్వానం పంపకుండా నేరుగా పిలవాలని పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఇ.మధుసూదన్ జిల్లా కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంతో పాటు, ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈసారి పదవుల్లో చిన్నమ్మ అనుయాయులకు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది.