: బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి రూపా గంగూలీకి తీవ్ర అస్వస్థత
బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి రూపా గంగూలీ ఈరోజు సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అనారోగ్యానికి గురైన ఆమెను వెంటనే కోల్ కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన తలనొప్పితో పాటు తనకు చూపు సరిగా కనపడటం లేదని ఆమె చెప్పడంతో ఆసుపత్రికి తరలించామని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు జాయ్ ప్రకాష్ మజుందార్ పేర్కొన్నారు. కోల్ కతాలోని సాల్ట్ లేక్ లో ఉన్న ఏఎంఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని అన్నారు.
వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి ఆమెను ఎప్పుడు డిశ్చార్జి చేస్తారన్న విషయం ఇంకా తెలియదని మజుందార్ చెప్పారు. కాగా, గత ఏడాది జనవరిలో రూపా గంగూలీ బీజేపీలో చేరారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా బీజేపీ ఆమెకు అవకాశం కల్పించింది.