: ట్రంప్ కు షాకిచ్చిన ఒబామా... ముస్లింలను వ్యతిరేకించే చట్టం రద్దు!
అమెరికాలో ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకుంటానని, ముస్లింలపై నిషేధం విధిస్తానని చెబుతున్న నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అధ్యక్షుడు బరాక్ ఒబామా షాకిచ్చారు. టెర్రరిస్టు ప్రభావిత దేశాల నుంచి వచ్చే యాత్రికులను నియంత్రించే నేషనల్ సెక్యూరిటీ ఎంట్రీ-ఎగ్జిట్ రిజిస్ట్రేషన్ (ఎన్ఎస్ఈఈఆర్ఎస్) చట్టాన్ని సెప్టెంబర్ 11/2001 దాడుల తరువాత తీసుకొచ్చింది. దీంతో 2001-2011 వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. తాజాగా జరిగిన బెర్లిన్ ఉగ్రదాడి అనంతరం ముస్లింలపై నిషేధం అవసరమని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉగ్రవాదులను గుర్తించేందుకు అమెరికా విమానాశ్రయాల్లో ఉండే హోంల్యాండ్ సెక్యూరిటీ విధానం సరిపోతుందని అధ్యక్షుడికి ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వడంతో ఆయన ఈ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం తొలుత ఇరాక్, ఇరాన్, లిబియా, సూడాన్, సిరియా దేశాలకు చెందిన వారిపై నిషేధం ఉండేది. ఆ తరువాత ఆఫ్రికా, మధ్య ఆసియాలోని 25 దేశాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. దీంతో ఈ దేశాలకు చెందిన వారు అమెరికాలో అడుగుపెట్టాలంటే పలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. ఎన్నో పరీక్షల అనంతరం వారిని అమెరికాలోకి అనుమతించేవారు. వారిపై నిఘా కూడా కొనసాగేది. తాజాగా ఈ చట్టం రద్దు చేయడంతో వారిపై ట్రంప్ ఊహించినంత వేగంగా నిషేధం అమలు సాధ్యం కాదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.