: అసలు పెళ్లెందుకు?: యువతీ యువకులు చెప్పిన ఆసక్తికర సమాధానాలు
అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి? పెళ్లయితే ఏం జరుగుతుంది? మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలని అనుకుంటున్నారు? వంటి ప్రశ్నలను సంధిస్తూ, 'షాదీ డాట్ కాం' నిర్వహించిన ఓ సర్వేలో పలు ఆసక్తికర సమాధానాలు వెల్లడయ్యాయి. పెళ్లి చేసుకునేందుకు మరింత కాలం పాటు వేచి చూడలేమని, పెళ్లితో ఆర్థిక స్థిరత్వం వస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 20.5 శాతం మంది యువకులు, 23.1 శాతం మంది యువతులు సమాధానం చెప్పారు. నాకు పెళ్లే వద్దని 12.2 శాతం మంది యువకులు, 10.3 శాతం మంది యువతులు, ఎప్పుడు చేసుకుంటామో చెప్పలేమని 18.2 శాతం మంది యువకులు, 13.2 శాతం మంది యువతులు సమాధానం చెప్పారు.
ఇక నాకు పెళ్లి వద్దని చెప్పిన వారిని ఎందుకు అలా అనుకుంటున్నారని ప్రశ్నించగా, బాధ్యతల బరువు తమకు వద్దని 35.1 శాతం మంది యువకులు, 27.2 శాతం మంది యువతులు చెప్పగా, పెళ్లిపై నమ్మకం లేదని 23.2 శాతం మంది యువకులు, 21.3 శాతం మంది యువతులు చెప్పారు. తమకు దీర్ఘకాల సంబంధాలు వద్దని 26.3 శాతం మంది యువకులు, 20.3 శాతం మంది యువతులు వెల్లడించడం గమనార్హం.
పెళ్లితో వచ్చే అతిపెద్ద లాభమేంటన్న ప్రశ్నకు ఇద్దరి మధ్యా బంధం బలపడుతుందని అత్యధికులు, జీవిత భాగస్వామి లభిస్తుందని, ఆర్థికంగా స్థిరపడే అవకాశం లభిస్తుందన్న సమాధానాలు వచ్చాయి. 25 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సున్న 14,700 మందిని (యువతులు 47 శాతం, యువకులు 53 శాతం) సర్వేలో భాగంగా ప్రశ్నించామని షాదీ డాట్ కాం సీఈఓ గౌరవ్ రక్షిత్ వెల్లడించారు.