: ఆకస్మిక తనిఖీకి వెళ్లిన సీబీఐ అవాక్కు... ఎండీసీబీలో ఏకంగా రూ. 169 కోట్ల అక్రమ ధనం
ఎక్కడైనా నల్ల ధనం డిపాజిట్ అవుతుందేమో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఓ కో ఆపరేటివ్ బ్యాంకుకు ఆకస్మిక తనిఖీ నిమిత్తం వెళ్లిన సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. మలప్పురంలోని మలబార్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎండీసీబీ)లో ఐదు రోజుల వ్యవధిలో రూ. 169 కోట్ల విలువైన రద్దయిన నోట్లను జమ చేశారని గుర్తించారు. నవంబర్ 10 నుంచి 14 తేదీల మధ్య ఈ డబ్బు డిపాజిట్ అయిందని గమనించిన అధికారులు, ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, డిపాజిటర్ల వివరాలు, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా సేకరించిన కేవైసీ వివరాలను తెలియజేయాలని బ్యాంకును ఆదేశించింది. సీబీఐ తనిఖీలు చేసే సమయానికి బ్యాంకులో రూ. 97 కోట్ల నగదు ఉంది. దీని గురించిన సమాచారాన్ని ఆర్బీఐకి బ్యాంకు తెలియజేయలేదని గమనించిన సీబీఐ, దీనిపైనా వివరణ కోరినట్టు తెలుస్తోంది. కాగా, ఈ లావాదేవీల వెనుక అక్రమాలు లేవని, నిబంధనల ప్రకారమే డిపాజిట్లు జరిగాయని ఎండీసీబీ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ మీనన్ వ్యాఖ్యానించారు.