: వాళ్లతో వెళితే పనివాళ్ల కన్నా హీనంగా చూశారు: ఐఓసీ అధికారులపై గోల్ఫర్ చౌరాసియా సంచలన విమర్శలు
తనకు మరోసారి భారత్ తరఫున ఏదైనా దేశంలో పోటీ పడే అవకాశం లభిస్తే వెళ్లేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానని ఇండియన్ గోల్ఫర్ ఎస్ఎస్పీ చౌరాసియా వ్యాఖ్యానించారు. రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న ఆయన, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధికారులపై సంచలన విమర్శలు చేశారు. అధికారులు తమను పనివాళ్ల కన్నా హీనంగా, బానిసలుగా చూశారని, వాళ్లకు వాళ్లు తమ యజమానులుగా భావించుకుంటూ వేధించారని ఆరోపించాడు.
చూరాసియాతో పాటు అనిర్బన్ లహరిలు రియోలో భారత్ తరఫున పాల్గొని వరుసగా 50, 57వ స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గేమ్స్ కు వెళ్లేముందు సన్నద్ధమయ్యేందుకు చౌరాసియాకు రూ. 30 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన ఐఓసీ, కేవలం రూ. 5.5 లక్షలిచ్చి సరిపెట్టిందని ఆయన ఆరోపించాడు. గడ్డకట్టే చలిలో తమను ఇబ్బందులు పెట్టారని, వర్షం పడుతుంటే రెయిన్ కోట్లు కాదుకదా, గొడుగులు కూడా ఇవ్వలేదని విమర్శలు గుప్పించాడు. ఇది తమకెంతో ఇబ్బందిని కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఈ ఆరోపణలపై ఐఓసీ స్పందించాల్సివుంది.