: ధోనీని కేర్ చేయని అశ్విన్... మండిపడుతున్న అభిమానులు
ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్న రవిచంద్రన్ అశ్విన్ పై ఇప్పుడు క్రీడాభిమానులు మండిపడుతున్నారు. అశ్విన్ పేరును ఐసీసీ వెల్లడించగానే అతనిపై అభినందనలు వెల్లువెత్తాయి. అందరితో పాటు భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా శుభాకాంక్షలు వెల్లడించాడు. ఇక తనకు అభినందనలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అశ్విన్ పలు ట్వీట్లు పెట్టాడు.
వీటిల్లో అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీలతో పాటు, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వంటి వారి పేర్లను కూడా ప్రస్తావించాడు. అశ్విన్ ట్వీట్లలో ధోనీ పేరు లేకపోయింది. అంతే, నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. తనకు వెన్నుదన్నుగా నిలిచిన ధోనీని అశ్విన్ మరచిపోయాడని ఆరోపించారు. ధోనీ మద్దతు కారణంగానే నాలుగేళ్ల నుంచి జట్టులో ఉన్నావని కొందరు, ఆయన పేరును ప్రస్తావించక పోవడం అహంకారానికి నిదర్శనమని మరికొందరు అశ్విన్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు.