: పోలీస్ బందోబస్తు మధ్య విడుదలవుతున్న 'వంగవీటి'... థియేటర్ల వద్ద ఉత్కంఠభరిత వాతావరణం
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సంచలన చిత్రం 'వంగవీటి' ఈ రోజు విడుదల అవుతోంది. విజయవాడలో వంగవీటి రంగా, దేవినేని నెహ్రూల మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో, విజయవాడలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అటు రంగా అభిమానులు, ఇటు నెహ్రూ అభిమానులు థియేటర్ల వద్ద హల్ చల్ చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో, ముందు జాగ్రత్త చర్యగా థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సినిమాలో ఏం చూపించారన్న విషయంలో ఇంత వరకు ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. సినిమా యూనిట్ కూడా దీని గురించి ఇంత వరకు ఎలాంట్ లీకులు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, ఈ సినిమా రంగాకు అనుకూలంగా ఉందా? లేక నెహ్రూకు అనుకూలంగా ఉందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఎవరిని తక్కువగా చూపించినా వారి అభిమానులు రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో, ఒక్క విజయవాడలోనే కాకుండా, ఏపీలోని పలు జిల్లాల్లో పోలీసులు థియేటర్ల వద్ద ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు.