: జయ మృతి రోజే కొత్త నోట్లపై కుట్రలు.. సీఎస్ రామ్మోహనరావు, శేఖర్‌రెడ్డి మధ్య ఫోన్‌లో సుదీర్ఘ చర్చ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన రోజే ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, చెన్నై కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి మధ్య కొత్త నోట్లు భద్రపరచడంపై టెలిఫోన్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. నోట్ల రద్దు తర్వాత పెద్ద నోట్లను పెద్ద ఎత్తున మార్పిడి చేస్తున్నవారిపై నిఘా పెట్టిన ఆదాయపు పన్నుశాఖ అధికారులు శేఖర్‌రెడ్డి టెలిఫోన్ సంభాషణలను ట్రాప్ చేయడంతో నోట్ల కుట్ర బయటపడింది. మొదట శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఐటీ అధికారులు అతడిచ్చిన సమాచారంతో సీఎస్ రామ్మోహన్‌రావు, అతడి కుటుంబ సభ్యుల ఇళ్లపైనా దాడులు చేసినట్టు ఓ అధికారి తెలిపారని పేర్కొంటూ ఓ తమిళ పత్రిక పేర్కొంది. శేఖర్‌రెడ్డితో జరిపిన టెలిఫోన్ సంభాషణ కారణంగానే సీఎస్ పట్టుబడ్డారని పేర్కొంది.
మరోవైపు రామ్మోహనరావు, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ అధికారులు నిర్వహించిన తనిఖీలు గురువారం ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన తనిఖీల్లో మొత్తం 15 కేజీల బంగారం, రూ.24 లక్షల నగదు, కీలక సమాచారం ఉన్న ల్యాప్‌టాప్, 3 హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహనరావు కార్యాలయం నుంచి 40 ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం తనిఖీల్లో రూ.100 కోట్లకుపైగా విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రామ్మోహన్‌రావు కుమారుడు వివేక్ నివాసం, కార్యాలయం, ఆయన న్యాయవాది ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.