: శాస్త్రవేత్తను కావాలనుకుని హీరోనయ్యాను: నారా రోహిత్
చిన్నతనంలో శాస్త్రవేత్త కావాలని అనుకున్నానని యువ నటుడు నారా రోహిత్ తెలిపాడు. అప్పట్లో ఓ సారి తన తండ్రి రామ్మూర్తినాయుడు సినిమాల్లోకి వెళ్తావా? అని అడిగారని, 'ఛీఛీ.. నేనెందుకెళ్తాను' అని అప్పట్లో అన్నానని తెలిపాడు. ఇంజనీరింగ్ కు వచ్చాక సినిమాల్లోకి వెళ్లాలని భావించానని, అందుకే 120 కేజీల బరువును తగ్గించుకుంటూ వచ్చానని, అందుకు చాలా కష్టపడ్డానని వెల్లడించాడు. అందర్లా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో ఎంటరవ్వడం ఇష్టం లేక 'బాణం'ను ఎంచుకున్నానని తెలిపాడు. ఆ సినిమా చూసి చిరంజీవిగారు అభినందించారని తెలిపాడు.
సినీ పరిశ్రమలో తనకు బాగా నచ్చిన వ్యక్తి తమిళనటుడు సూర్య అని చెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి రావాలన్న తన స్పూర్తికి ఆయనే కారణమని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ లను తప్ప ఇప్పటి వరకు పవన్ కల్యాణ్, మహేష్ బాబులను కలవనేలేదని వెల్లడించాడు. బాలకృష్ణతో చిన్నప్పటి నుంచి అనుబంధం ఉందని అన్నాడు. ఆయనది చిన్న పిల్లల మనస్తత్వమని తెలిపాడు. నాగశౌర్య తనకు మంచి స్నేహితుడని తెలిపాడు. తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదని, కానీ 'లీడర్' చూశాక మాత్రం ఆ సినిమా చేసి ఉండాల్సిందనిపించిందని రోహిత్ తెలిపాడు. నోట్ల రద్దు గురించి ముందే తెలియడంతో తమ కుటుంబం డబ్బులు మార్చేసుకుందని ఆరోపణలు వచ్చాయని, అలా ముందే తెలిసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.