: యూపీ ఓటర్లకు కులం గాలమేసిన అఖిలేష్ యాదవ్
2016-2017 విద్యా సంవత్సరం ముగిసేలోపు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమీషన్ భావిస్తున్న తరుణంలో ఇతర పార్టీలను అడ్డుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి సరికొత్త అస్త్రాన్ని బయటకి తీశారు. దీంతో ప్రత్యర్థి పార్టీలన్నీ షాక్ కు గురయ్యాయి. యూపీ ఎన్నికలను ప్రభావితం చేయగల కులం కార్డును బయటికి తీశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపిస్తున్న అఖిలేష్ యాదవ్ తాజాగా, తమను ఎస్సీల్లో చేర్చాలంటూ గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న 17 ఇతర వెనుకబడిన (ఓబీసీ) కులాలను షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాలో చేరుస్తున్నట్టు ప్రకటించారు.
ఈ మేరకు త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదన పంపనున్నామని అన్నారు. కేంద్రం ఆమోదం పొందిన వెంటనే ఆ కులాలన్నీ ఎస్సీ జాబితాలో చేరుతాయని ఆయన చెప్పారు. ఈ జాబితాలో కహర్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, బహర్, ప్రజాపతి, రాజ్ భర్, బథాం, గౌర్, తురా, మంఝీ, మల్హా, ధీమర్, మచౌ తదితర 17 ఓబీసీ ఉప కులాలు చేరనున్నాయి. దీనికి 2013 మార్చిలో అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానంతో పాటు ఈ 17 కులాల స్థితిగతులపై యూపీ ఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సమగ్ర అధ్యయనం నివేదికను కూడా కేంద్రానికి పంపనుంది.