: 'ఇదిరా.. చిరంజీవి!'.. అనేలా సినిమా ఇస్తాను: చిరంజీవి


‘మీరంతా గర్వించేలా.. 'ఇదిరా! చిరంజీవి' .. అనేలా ఖైదీ నంబర్ 150 సినిమా ఇస్తాను. ది బెస్ట్ పెర్ఫామెన్స్ ని ఇస్తాను’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (మా) డైరీ -2017ను ఈరోజు ఆయన ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ చిత్రంతో తిరిగి వస్తున్నందుకు తమ్ముళ్లు 150 గులాబీలు ఉన్న పుష్పగుచ్ఛం ఇచ్చి ఉత్సాహపరచడం సంతోషంగా ఉంది. తమ్ముళ్ల  ప్రేమ మురిపిస్తోంది. కళామతల్లి ముద్దుబిడ్డలుగా నాపై ప్రేమ కురిపిస్తున్నందుకు మైమరచిపోతున్నా. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరించే చిత్రమవుతుంది. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివాజీరాజా ఆధ్వర్యంలోని టీమ్ అందరూ మెచ్చుకునేలా ‘మా’ ని నడిపిస్తున్నారు.  ‘మా’ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ గా వారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాను. అందరికీ, క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని చిరంజీవి అన్నారు.

అంతకుముందు, చిరంజీవిని ‘మా’ బృందం సత్కరించి, కేక్ కట్ చేయించింది. 150 గులాబీలతో ఉన్న ఒక పుష్పగుచ్ఛాన్ని ‘మా’ అధ్యక్ష కార్యదర్శులు చిరంజీవికి అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News