: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ రాజీనామా!
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కాసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు తనకు సహకారం అందించినందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తన బద్ధ శత్రువు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. గత రెండేళ్లుగా తనతో పాటు పనిచేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని నజీబ్ జంగ్ తెలిపారు. అంతేకాక, తనపై అపారమైన ప్రేమ, అభిమానం చూపిన ఢిల్లీ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యంగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో ప్రజలంతా తనకు ఎంతో సహకరించారని... అందువల్ల పాలనకు ఏమాత్రం అడ్డంకులు ఎదురుకాలేదని చెప్పారు. 2013లో లెఫ్టినెంట్ గవర్నర్ గా ఆయన పదవీబాధ్యతలను స్వీకరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి వీరిద్దరికి బద్ధ విరోధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉండాలనే ఆలోచనతోనే జంగ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆయన మళ్లీ తనకు ఎంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని చేపడతారని సమాచారం.