: ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేసి జీవితాంతం వాడేయొచ్చు!


సెల్ ఫోన్, ల్యాప్ ట్యాప్, రేడియో, వాచ్, షేవింగ్ రేజర్, డ్రయ్యర్ వంటి బ్యాటరీ వినియోగించే సాధనాలన్నింటికీ ఛార్జింగ్ కష్టాలు తీరిపోనున్నాయి. బ్యాటరీల జీవిత కాలంపై ఎన్నో పరిశోధనలు చేసిన బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త డైమండ్ బ్యాటరీని రూపొందించారు. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే...ఇక జీవితకాలం ఛార్జింగ్ చేయించాల్సిన అవసరం లేదు. జీవిత కాలం అంటే మన జీవిత కాలం కాదు. బ్యాటరీ జీవిత కాలం! ఈ డైమండ్ బ్యాటరీ జీవిత కాలం 11,460 సంవత్సరాలు. ఈ బ్యాటరీలో సగం ఛార్జింగ్ అయిపోవాలంటే 5,730 ఏళ్లు పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

అణువిద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థాల్లో అణుధార్మికత కలిగిన కార్బన్ 14 లభ్యమవుతుందని, దీనితో డైమండ్స్ ను తయారు చేయవచ్చని, వీటితో బ్యాటరీలను తయారు చేయవచ్చని వారు చెబుతున్నారు. అణుధార్మికత కలిగిన ఆ వజ్రం నుంచి నిత్యం విద్యుత్ వెలువడుతుందని పరిశోధనలతో నిరూపించామని వారు తెలిపారు. ఈ కృత్రిమ డైమండ్ బ్యాటరీ నుంచి విడుదలయ్యే రేడియో ధార్మికత కారణంగా ఎలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు బ్యాటరీ బయట ఒక పొరను ఏర్పాటు చేయాలని వారు చెప్పారు.

 ఆ కవచం కారణంగా ఒక రేడియో ధార్మిక డైమండ్ బ్యాటరీ నుంచి వెలువడే రేడియో ధార్మికత ఒక అరటి పండు నుంచి వెలువడే అణుధార్మికతకు సమానంగా ఉంటుందని వారు తెలిపారు. వీటి వల్ల మానవులకు ఎలాంటి నష్టం వాటిల్లదని వారు వెల్లడించారు. ఈ బ్యాటరీ ఎన్ని ఏళ్లలో విరివిగా అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం వారు ఇంకా వెల్లడించలేదు!  

  • Loading...

More Telugu News