: భలే మంచి చౌక బేరమూ... కేజీ బంగారం రూ. 3 లక్షలే... కొత్త రకం చీటింగ్!
ఇత్తడికి బంగారం పూత పూసి అమ్మిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. వివరాల్లో కి వెళ్తే, గత నెల 10వ తేదీన వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేశారు. తమ వద్ద బంగారం ఉందని, తమ ఇంటిని కూల్చివేస్తున్నప్పుడు దొరికిందని చెప్పారు. కేజీ బంగారం రూ. 3 లక్షలకే అమ్మేస్తామని తెలిపారు. ఆ తర్వాత వెంకటేశ్వరరావును కలిసి, 1 గ్రాము బంగారు కాయిన్ చూపించారు. దాన్ని టెస్ట్ చేయించి, నిజమైన బంగారమే అని వెంకటేశ్వరరావు నిర్ధారించుకున్నాడు.
ఆ తర్వాత వారి వద్ద నుంచి కిలో బంగారం తీసుకుని రూ. 3 లక్షలు ఇచ్చేశాడు. ఆ తర్వాత బంగారం షాపు వద్దకు తీసుకెళ్తే... అది ఇత్తడి అని, దానిపై బంగారం పూత పూశారని తెలిసింది. తాను మోసపోయానని తెలుసుకున్న వెంకటేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో, మరికొంత బంగారం కావాలని నిందితులకు ఫోన్ చేయమని పోలీసులు సూచించారు. ఈ క్రమంలో, నకిలీ బంగారంతో మళ్లీ నిన్న వారు జగిత్యాలకు వచ్చారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను బళ్లారి జిల్లా బత్తలపల్లికి చెందిన కావడి రవిచంద్ర, కావడి శ్రీకాంత్ లుగా గుర్తించారు. వారి నుంచి రూ. 2.8 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.