modi: ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేది!: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్!
అవినీతి పరులకు మద్దతుగా విపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు వారణాసిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కొందరు నేతలు అవినీతిపరులకు మద్దతుగా నిలుస్తారని తాను ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్యానించారు. కొందరు అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. దేశంలో సగం మంది పేదలు ఉన్నందున నగదురహిత లావాదేవీలు సాధ్యం కాదని మన్మోహన్ సింగ్ అన్నారని, భారత్లో 50 శాతం మంది పేదలు ఉండడానికి కాంగ్రెసే కారణమని అన్నారు. తాము చేస్తోన్న కార్యక్రమాలతో దేశం స్వచ్ఛమైన బంగారంలా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతికి తావులేని దిశగా దేశాన్ని నడిపించేందుకు తనకు చదువుకున్న యువత తోడ్పాటు కావాలని కోరారు.
దేశంలో ఓ యువనేత ఉన్నాడని, ఆయన ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకుంటున్నాడని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ అన్నారు. ఆయన మాట్లాడితే భూకంపం వస్తుందని అన్నాడని, చివరికి మాట్లాడాడని, అయితే భూకంపం రాలేదని ఆయన అన్నారు. భూకంపం రానందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేదని వ్యాఖ్యానించారు.