: ఇండియాకు స్వాగతం: పాక్ సైనికాధికారి వినూత్న ఆఫర్
పాకిస్థాన్ నుంచి భారత్ కు ఓ ఆశ్చర్యకరమైన ఆఫర్ వచ్చింది. వేల కోట్ల రూపాయల విలువైన చైనా - పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగస్వామ్యం కావాలని, ఈ మేరకు శత్రుత్వాన్ని పక్కన బెట్టాలని పాక్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ రియాజ్ పిలుపునిచ్చారు. ఇండియా కూడా కలిసి వస్తే సీపీఈసీ ప్రాజెక్టు మరింతగా విజయవంతమవుతుందని అన్నారు. బెలూచిస్థాన్ ఫ్రాంటియర్ కార్ప్స్ అధికార కార్యాలయంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రియాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 46 బిలియన్ డాలర్ల విలువైన సీపీఈసీ ప్రాజెక్టులో భాగమయ్యేందుకు ఇరాన్, ఆఫ్గనిస్థాన్ లు అంగీకరించాయని గుర్తు చేస్తూ, కేంద్ర ఆసియా దేశాలన్నీ ఈ ప్రాజెక్టు ఫలాలను అందుకోవచ్చని తెలిపారు. ఈ ఫలాలను ఇండియా కూడా అందుకోవాలని, పాక్ వ్యతిరేక కార్యకలాపాలను ఆపి కలిసి రావాలని ఆయన కోరారు.