: నా ప్లాన్ మీకు తెలుసు... ముస్లింలపై నా రూటే కరెక్ట్: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వారంలో బెర్లిన్, అంకారాల్లో జరిగిన ఉగ్రదాడులపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై తన వైఖరి సరైనదేనని అన్నారు. అమెరికాలోకి ముస్లింల వలసలను అడ్డుకునేందుకు తాను పాటించాలనుకున్న విధానమే కరెక్టని అన్నారు. "ఇక్కడ జరుగుతున్నది ఘోరాతి ఘోరం. నా ప్లాన్లు ఏంటో మీకు తెలుసు. నా దారి సరైనదే. 100 శాతం కరెక్ట్" అని ఆయన అన్నారు.
బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్లో ట్రక్కుతో దాడి చేసి 12 మందిని పొట్టన బెట్టుకున్న ఘటనతో పాటు, అంకారాలో రష్యా రాయబారిని కాల్చి చంపిన ఘటనలపై అభిప్రాయాన్ని చెప్పాలని ట్రంప్ ను కోరగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రస్తుతం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో భాగంగా మార్-ఏ-లాగో రిసార్ట్ లో ట్రంప్ కుటుంబం సేదదీరుతోంది. ఇక్కడే ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాద దాడులపై స్పందించారు.