: ఆసక్తి చూపని వైకాపా అనుచరులు, స్వాగతమంటున్న టీడీపీ.... కల్పన ముందు వింత పరిస్థితి!
వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించాలని నిర్ణయించుకున్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన ముందు ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది. దాదాపు ఏడాదిగా ఆమె పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుండగా, పామర్రు వైకాపా నేతలు, అనుచరులు ఇష్టపడని కారణంగానే ఆమె పార్టీ మారడం వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఇప్పుడు వైకాపా నేతలు పెద్దగా ఆసక్తి చూపకపోయినప్పటికీ, స్థానిక తెలుగుదేశం నేతల నుంచి వచ్చిన ప్రోత్సాహంతోనే ఆమె ఫిరాయింపు దిశగా మొగ్గు చూపినట్టు సమాచారం. వాస్తవానికి కల్పన రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ పడి ఓటమిని చవి చూశారు. ఆపై వైకాపాలో చేరిన తరువాతనే ఆమె దశ తిరిగింది. టీడీపీలో పేరున్న నేత వర్ల రామయ్యను ఓడించారు.
ఉన్నది వైకాపా ఎమ్మెల్యేగానైనా, నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలతో ఆమె సన్నిహిత సంబంధాలు నడిపినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారే ఆమెకు మద్దతు పలుకుతున్నారు. నిన్న సాయంత్రం కూడా పలువురు వైకాపా నేతలతో సమావేశమైన ఆమె, 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడకు రావాలని కోరగా, కొందరు మాత్రమే సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ మారితే, ఆమెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి మద్దతు కరవవడం ఖాయంగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే కీలక నేతగా ఉన్న వర్ల రామయ్య వర్గం నుంచి ఎంతమంది కల్పనకు మద్దతు పలుకుతారోనన్న విషయమై అనుమానాలూ నెలకొన్నాయి.