: స్మార్ట్‌ఫోన్ల వాడకంలో మగువలే ముందు.. ఎక్కువ సమయాన్ని కేటాయించేది వారేనట!
దేశంలో పురుషులతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వినియోగించేది మహిళలేనని తాజా సర్వేలో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ వీడియోలు, గేమ్స్ కోసం పురుషల కంటే మహిళలే రెండింతలు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారని తేలింది. దేశంలోని మొబైల్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లు, అందులోని ఫీచర్లను ఏ మేరకు ఉపయోగిస్తున్నారన్న దానిపై మొబైల్ మార్కెటింగ్ అసోసియేషన్(ఎంఎంఏ), పరిశోధన సంస్థ ఐఎంఆర్‌బీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
సర్వే నివేదికను బుధవారం విడుదల చేశారు. దీని ప్రకారం.. సామాజిక మాధ్యమమైన ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నది మహిళలే. ఫేస్‌బుక్ కోసం పురుషల కంటే 80 శాతం ఎక్కువ సమయాన్ని వారు కేటాయిస్తున్నారు. అలాగే యూట్యూబ్, గేమ్స్ కోసం పురుషుల కంటే రెండు రెట్లు అధికంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. టీవీలు, ఇతర మాధ్యమాల కంటే కూడా మూడు గంటలు అదనంగా ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నట్టు సర్వేలో తేలింది.