: ముఖ్యమంత్రుల్లో ఉత్తమ అవకాశవాది చంద్రబాబే: రఘువీరారెడ్డి
ముఖ్యమంత్రుల్లో ఉత్తమ అవకాశవాది ఏపీ సీఎం చంద్రబాబేనని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం పరిణామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈరోజు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ‘చలో వెలగపూడి- ప్రశ్నిద్దాం రండి’ పేరుతో రేపు ప్రజాధర్నా నిర్వహిస్తున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయమై రోజుకో మాట, పూటకో ఉత్తర్వులు ఇస్తున్నారని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సర్కస్ కంపెనీని తలపిస్తోందని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సర్కస్ కంపెనీ పెట్టుకుంటే మంచిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. మోదీ పిచ్చి తుగ్లక్ పాలనలో బాబు ప్రధాన భాగస్వామి అని, చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన పూర్తి అవినీతిమయమని మండిపడ్డారు. ‘చలో వెలగపూడి- ప్రశ్నిద్దాం రండి’ ధర్నాలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని రఘువీరారెడ్డి కోరారు.