: సీబీఐ దాడులు బీజేపీ కుట్రంటున్న అన్నాడీఎంకే... తమకు సంబంధం లేదంటున్న బీజేపీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయించి తమను, తమ పార్టీ సన్నిహితులను భయభ్రాంతులకు గురి చేస్తోందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ధీరన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన చెన్నైలో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని భయభ్రాంతులను చేసేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఐటీని, సీబీఐని ఉసిగొల్పుతోందని అన్నారు. బీజేపీ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు.
బీజేపీ దాడులను తాము చట్టప్రకారమే ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన తమిళ బీజేపీ సీనియర్ నేతలు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, ఈ దాడులకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఐటీ శాఖకు అందిన సమాచారం మేరకే దాడులు, తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. ఐటీ అధికారులకు అందిన సమాచారం మేరకు వారు దాడులు నిర్వహిస్తారని, ఇందులో ఎవరికీ మినహాయింపు లేదని వారు స్పష్టం చేశారు.