: అమిత్ షా ఇంటిమీద ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదు?: మమతా బెనర్జీ సూటి ప్రశ్న
అక్రమంగా ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో వారిపైన, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసాలపైన ఐటీ ఎందుకు దాడులు చేయడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మమత బెనర్జీ, పలు ట్వీట్లు చేశారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంటిపై దాడులు చేసి ఆయన్ని వేధించారు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు ఇంటిపై దాడులు చేస్తున్నారు. ఎందుకీ ప్రతీకార, అనైతిక చర్యలు? అని ఆమె ప్రశ్నించారు. ఇది దేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేసినట్టవుతుందని ఆమె తెలిపారు.
అవినీతిని గట్టిగా వ్యతిరేకించాల్సిందేనని స్పష్టం చేసిన మమత, బాధ్యత గల ప్రభుత్వాధికారి ఇంటిపై దాడులు చేయాలంటే అందుకు సరైన విధానం అవలంబించాలని సూచించారు. రామ్మోహనరావుకు వ్యతిరేకంగా కచ్చితమైన సమాచారం లభ్యమైనట్టయితే ముందు ఆయనను విధుల నుంచి తప్పించిన తరువాతే ఆయనపై విచారణ జరపాలని ఆమె సూచించారు. అలా కాకుండా దుర్బుద్ధితో దాడులు నిర్వహించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.