: అమీర్ ఖాన్ 'దంగల్' గురించి సెలబ్రిటీలు ఏమన్నారంటే..!
2016 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్న 'దంగల్' సినిమా బాలీవుడ్ సెలబ్రిటీలను ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'దంగల్' సినిమాను బాలీవుడ్ సెలబ్రిటీల కోసం చిత్రయూనిట్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. సినిమా చూసిన అందరూ అమీర్ ఖాన్ నటనను, యూనిట్ ప్రతిభను కొనియాడారు.
యువనటుడు అర్జున్ కపూర్ మాట్లాడుతూ, ఈ సినిమా క్రీడాకారులు, మహిళలకు అద్భుతమైన ఈవెంట్ అని, అమీర్ ఖాన్ మరోసారి మనలో స్పూర్తి నింపుతారని అన్నారు. అమీర్ ల్యాండ్ మార్క్ పెర్ఫ్మెన్స్ చూపించారని, ఇద్దరమ్మాయిలు కూడా పోటాపోటీగా నటించారని, దర్శకుడు సినిమాను భావోద్వేగాలతో తీశారని ప్రముఖ రచయిత ప్రసూన్ జోషి తెలిపారు.
'దంగల్' యూనిట్ కి తలవంచి నమస్కరిస్తున్నాని, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, నటన... ఏ విధంగా చూసినా అద్భుతమైన సినిమా అని ప్రముఖ రాజకీయనేత మిలింద్ దేవ్ రా అన్నారు. తాను ఇప్పటి వరకు చూసిన సినిమాల్లో 'దంగల్' అద్బుతమైన సినిమా అని, మున్ముందు కూడా 'దంగల్' గొప్ప సినిమాగా నిలిచిపోతుందని దర్శకుడు శిరీష్ కుందర్ తెలిపాడు.