: చెక్కులు లేదా ఈ-పేమెంట్ విధానంలో వేతనాల జారీ ఆర్డినెన్స్ కు క్యాబినెట్ ఓకే


ఉద్యోగుల వేతనాలను ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో ఇచ్చేలా ఆర్డినెన్స్ తీసుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఎంపిక చేసిన కొన్ని రంగాల్లోని పరిశ్రమలు, ఇకపై తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలను చెక్కుల జారీ ద్వారా లేదా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని స్పష్టం చేస్తూ, ఆర్డినెన్స్ ను రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు 1936 నాటి వేతన చెల్లింపు చట్టానికి సవరణలు చేసింది. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా సంస్థల యాజమాన్యాలకు ఊరటనిస్తూ, చెల్లింపులను నగదు రూపంలోనే ఇవ్వాలని నిర్ణయించుకుంటే అభ్యంతరం లేదని పేర్కొంది. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తుండాలని ఆదేశించింది.

ఎలక్ట్రానిక్ విధానంలో సులువుగా వేతనాలు చెల్లించవచ్చని, బడ్జెట్ సమావేశాల్లోగా వేతన చట్టానికి సవరణల బిల్లును ఆమోదింపజేసుకుంటామన్న ఆశాభావం ఉందని, ఈ రెండు నెలలూ కూడా కరెన్సీ కష్టాలు ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే ఆర్డినెన్స్ తెస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రైల్వే, టెలికం, గనులు వంటి శాఖలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. అతి త్వరలో ఇండియన్ ఎంటర్ ప్రైజస్ డెవలప్ మెంట్ సర్వీసెస్ ను ఏర్పాటు చేస్తామని, మొత్తం వేతనాల జారీ విధానాన్ని పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News