: శాసన మండలిలో షబ్బీర్ అలీ, మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వివాదం
నిన్న శాసనసభలో తెలంగాణ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేత జానారెడ్డికి మధ్య వాగ్వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రోజు శాసన మండలిలో కేటీఆర్‌కి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీకి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. షబ్బీర్ అలీ శాసనమండలిలో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల పోరాటంతోనే సాధించుకున్నామని, ఒకరు పెట్టిన బిక్షకాదని ఆయన అన్నారు. నిన్న శాసనసభలో ఒకరు, ఈ రోజు మరొకరు తెలంగాణపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. షబ్బీర్ అలీ సభలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని కేటీఆర్ అన్నారు.
1956లో తెలంగాణకు ఆంధ్రాతో కాంగ్రెస్ బలవంతంగా పెళ్లి చేసిందని కేటీఆర్ అన్నారు. 1969లో తెలంగాణ పోరాటంలో పాల్గొంటున్న విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపలేదా? అని ప్రశ్నించారు. 2004లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 వరకు తెలంగాణపై కాంగ్రెస్ పార్టే తాత్సారం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణను విధి లేని పరిస్థితుల్లోనే ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించే పట్టించుకోలేదని, ఇప్పుడు రైతుల సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుందని వివరించారు.