: చాయ్ వాలాకు రూ. 2 లక్షలు బకాయిపడ్డ మహారాష్ట్ర కాంగ్రెస్
మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాఖ దగ్గర చాయ్ పైసలు చెల్లించేందుకు కూడా డబ్బులున్నట్టు లేవు. ఇంతకీ విషయం ఏంటంటే, ముంబై ఆజాద్ మైదాన్ దగ్గరున్న రీజనల్ కాంగ్రెస్ కమిటీ (ఎంఆర్సీసీ) కార్యాలయం సమీపంలో ఇందర్ జోషి అనే వ్యక్తి చిన్న చాయ్ దుకాణాన్ని నడుపుకొంటున్నాడు. అక్కడికి వచ్చే కాంగ్రెస్ బడా నేతల నుంచి సాధారణ కార్మికుల వరకూ అతను పెట్టే చాయ్ అంటే ఎంతో ఇష్టం. ఇక పార్టీ కార్యాలయం నుంచి అయితే, గంట గంటకూ ఆర్డర్ వస్తుంటుంది. జోషి కుటుంబం దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో చాయ్ దుకాణం నడుపుతూ ఉండగా, చానాళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ డబ్బివ్వడం మానేసింది. ప్రస్తుతం అతనికి పార్టీ పడ్డ బకాయి రూ. 2 లక్షలకు పైమాటే. అయితే, కాంగ్రెస్ పార్టీ ఏనాటికైనా తన డబ్బును తిరిగి ఇస్తుందని నమ్ముతున్నట్టు జోషి చెబుతున్నాడు. ఇక చాయ్ పైసలు ఇవ్వని విషయాన్ని ఎంఆర్సీసీ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సైతం అంగీకరిస్తూ, ఇటీవలే తనకు విషయం తెలిసిందని, త్వరలోనే డబ్బులు చెల్లించే ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.