: 'ఏప్రిల్ - మార్చి' ఫైనాన్షియల్ ఇయర్ ఇక ఉండదు... 150 ఏళ్ల సంప్రదాయానికి చెల్లు!


ఓ ఆర్థిక సంవత్సరం... ఏప్రిల్ 1 నుంచి మొదలై, మార్చి 31తో ముగిసే కాలం. బ్రిటీష్ సంప్రదాయం. ఇండియాలో 1867 నుంచి అమలవుతున్న విధానం. ప్రపంచంలోని ఎన్నో దేశాలు 'జనవరి - డిసెంబర్' కాలాన్ని ఓ ఆర్థిక సంవత్సరంగా లెక్కిస్తుండగా, ఇండియా కూడా అదే దారిలో నడిచేందుకు సిద్ధమవుతోంది. 150 ఏళ్ల 'ఏప్రిల్ - మార్చి' ఫైనాన్షియల్ ఇయర్ సంప్రదాయాన్ని వదిలివేయాలని మోదీ సర్కారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం జూలై లోనే మాజీ ఆర్థిక సలహాదారు శంకర్ ఆచార్య అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఆర్థిక సంవత్సరాన్ని మార్చే విషయమై సిఫార్సులు చేయాలని సూచించింది.

ఇక ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై, పారిశ్రామిక సంఘాలు, వివిధ మంత్రిత్వ శాఖలతో సమావేశమై నివేదికను సిద్ధం చేసిందని, ఇది ఈ నెల 31న ప్రభుత్వానికి చేరనుందని ఆర్థిక శాఖ లోక్ సభకు వెల్లడించింది. ఫైనాన్షియల్ ఇయర్ ను మార్చాలని 1984లో అప్పటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎల్కే ఝా నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇక ప్రస్తుతం కమిటీ సిఫార్సులు అందగానే, దానిపై మరోసారి చర్చించి శతాబ్దన్నర కాలంగా ఉన్న 'ఏప్రిల్ - మార్చి' సంప్రదాయాన్ని మోదీ సర్కారు తొలగించనుందని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News