chandrababu: నేను పాదయాత్ర చేసే సమయంలోనే నాకు షుగర్ వచ్చింది.. అంతకుముందు లేదు: చంద్రబాబు
విజయవాడలో నిర్వహించ తలపెట్టిన కలెక్టర్ల సదస్సు ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు తాను 208 రోజులు ప్రజల కష్టాలను తెలుసుకుంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తూ తిరిగానని అన్నారు. తాను పాదయాత్ర చేసే సమయంలోనే తనకు షుగర్ వచ్చిందని, అంతకుముందు తనకు షుగర్ లేదని అన్నారు. అంతేగాక పాదయాత్ర మొదలుపెట్టిన కొన్ని రోజులకే తనకు కాళ్ల నొప్పులు కూడా మొదలయ్యాయని, ఏం చేయాలని తాను డాక్టర్లను అడిగితే విశ్రాంతి తీసుకోవడమే సమస్యకు పరిష్కారం అని చెప్పారని చంద్రబాబు అన్నారు. అలా కుదరదని మరో సలహా ఇవ్వమని తాను కోరానని చెప్పారు. దాంతో డాక్టర్లు సిమెంటు రోడ్లపై నడవకూడదని చెప్పారని అన్నారు.
మట్టి రోడ్డుపై మాత్రమే నడవాలని తనకు వైద్యులు సలహా ఇచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మట్టిరోడ్డు అంటే రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పారు. అలాగే చేస్తూ రోడ్డుపై కూడా నడుస్తూ తన పాదయాత్రను పూర్తి చేశాననని చెప్పారు. తాను కుంటుకుంటూ నడుస్తుంటే 'ఎందుకు సర్ ఇదంతా?' అని కొందరు అన్నారని, అయినా పట్టు విడవకుండా పాదయాత్రను పూర్తి చేశానని చెప్పారు. పట్టుదలతో పనులు చేస్తే అన్ని పనులు పూర్తవుతాయని కలెక్టర్లకు చెప్పారు. సంవత్సర కాలంలోనే పట్టిసీమను పూర్తి చేశామని, ముందు చూపుతో పనిచేసి ఎన్నో ఎకరాలకు నీళ్లివ్వగలుగుతున్నామని అన్నారు. సమర్థత, నైపుణ్యం పెంచుకోవాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.
ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనులు చేసే విధానాన్ని పెంపొందించుకోవాలని చంద్రబాబు నాయుడు చెప్పారు. తమకు ఐదేళ్లకు ఒకసారి పరీక్షలకు ఉంటాయని, మంచిగా పనిచేయకపోతే ప్రజలు ఓట్లు వేయబోరని ఆయన అన్నారు. తమకు ఆర్ధసంవత్సర పరీక్షలు పూర్తయ్యాయని, తాము మరో రెండున్నర ఏళ్లు కష్టపడి పనిచేయాల్సి ఉందని చెప్పారు. నిధులు ఒక్కటే ముఖ్యం కాదని సమర్థవంతంగా పనిచేయడమే ముఖ్యమని చెప్పారు. మనకు తీర ప్రాంతం ఒకపెద్ద ఆస్తి అని ఆయన అన్నారు.