: శశికళపై జయలలిత మేనల్లుడి అభిప్రాయం ఏమిటి? పలు విషయాలను తెలిపిన దీపక్... చదవండి!


జయలలిత మరణం తర్వాత ఆమె మేనల్లుడు దీపక్ ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు. జయ నెచ్చెలి శశికళతో పాటు ఆమె అంత్యక్రియలను నిర్వహించాడు దీపక్. జయకు అంత్యక్రియలు నిర్వహించిన ఆ యువకుడు ఎవరంటూ... ఆరోజు అందర్లోనూ ప్రశ్న తలెత్తింది. ఆ తర్వాత తెలిసింది అతను జయకు మేనల్లుడని... ఆమె సొంత అన్న కుమారుడని. ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ పలు విషయాలను వెల్లడించాడు. అతను ఏం చెప్పడో అతని మాటల్లోనే విందాం.

"34 ఏళ్లపాటు మా మేనత్త జయ కేవలం శశికళ అత్తను మాత్రమే తన వద్ద ఉంచుకున్నారు. ఆమె చివరి క్షణం వరకు ఆమెకు తోడుగా శశి అత్తే ఉన్నారు. శశి అత్తే ఆమెకు అత్యంత విశ్వాసపాత్రురాలు. విషప్రయోగంతో మా మేనత్తను చంపారన్న విషయం కేవలం కట్టు కథ మాత్రమే. అపోలో ఆసుపత్రిలో అత్త చికిత్స పొందిన 75 రోజుల్లో 5 రోజులు మినహా మిగతా అన్ని రోజులు నేను ఆమెతోనే ఉన్నా. అపోలో ఆసుపత్రి చికిత్స అంటే కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే చేసే చికిత్స కాదు. లండన్ డాక్టర్, ఎయిమ్స్ వైద్యుల బృందం అందరూ కలసి అత్తకు చికిత్స చేశారు.

అత్తతో మా కుటుంబీకులకు ఎలాంటి గొడవలు లేవు. ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తినప్పటికీ, కుటుంబీకుల మధ్య ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి? మా సోదరి దీప తనంతట తానే అత్తతో అగాధం సృష్టించుకుంది. నేను మాత్రం వీలున్నప్పుడల్లా అత్తతో మాట్లాడుతుండేవాడిని. దీప అలా చేసేది కాదు. నాలుగు నెలల క్రితం పోయెస్ గార్డెన్ లో జరిగిన ఓ పూజకు కూడా అత్త నన్ను పిలిచారు. పూజలో సంకల్పాన్ని నా చేతే చేయించారు అత్త. మధ్యాహ్నం భోజనం అక్కడే చేసి, రాత్రి ఇంటికి వెళ్లి పోయాను. అత్త చాలా స్ట్రిక్ట్. అనేక కట్టుబాట్ల మధ్య పోయెస్ గార్డెన్ లో ఉండాలంటే రోబోలా ఉన్నట్టు అనిపించేది. అందుకే ఎప్పుడైనా అక్కడకు వెళితే, సాయంత్రం కాగానే అత్త కంటబడకుండా అక్కడ నుంచి వచ్చేసేవాడిని.

అన్నాడీఎంకేలో చేరుతారా? అని కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకు లేదు. దీపకు కూడా రాజకీయాల్లోకి రాకూడదనే సలహా ఇస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికళకు మద్దతు ప్రకటిస్తే... అమ్ముడుపోయానంటూ నాపై మీరే కథనాలు రాస్తారు. కానీ, శశి అత్త చాలా మంచివారు. అత్త ఆస్తులు ఎవరికి చేరాలో వారికే చేరుతాయి. చెడ్డవారి చేతుల్లోకి వెళ్లకుండా మాత్రం నేను అడ్డుకుంటా" అన్నాడు దీపక్. 

  • Loading...

More Telugu News