: బ్రిటన్ ను దాటేశాం... ఆరవ అతిపెద్ద ఎకానమీగా అవతరించిన ఇండియా
భారత్ కు శుభవార్త. ఒకనాడు బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల్లో చిక్కుకుని శతాబ్దాల పాటు అవస్థలు పడి, ఆపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఇండియా, ఇప్పుడు అదే బ్రిటన్ ను మించిన శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దాదాపు 100 సంవత్సరాలుగా టాప్-6 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న బ్రిటన్ ను ఇండియా అధిగమించింది. స్థూల జాతీయోత్పత్తిలో ఇండియా బ్రిటన్ ను దాటి ముందుకు అడుగేసింది. ఇప్పుడిక అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ తరువాతి స్థానం ఇండియాదే. ఇండియాలో శరవేగంగా అభివృద్ధి నమోదవుతుండటం, బ్రెగ్జిట్ తరువాత బ్రిటన్ లో నెలకొన్న మాంద్యం కారణంగానే, ఇండియా ఓ మెట్టు ఎక్కగా, బ్రిటన్ జారినట్టు తెలుస్తోంది.
ఇక ఆర్థిక పరిభాషలో 2016 సంవత్సరం ఇండియాకు అత్యంత శుభ ఫలితాలను అందించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రపంచంలోనే వేగంగా పరిగెడుతున్న ఎకానమీగా చైనాను భారత్ దాటేసింది. ఆపై అక్టోబర్ లో ఐఎంఎఫ్ ఇండియాకు కితాబిస్తూ, ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశం చేయనున్న దేశం ఇండియానేనని తెలిపింది. 2017లో జీడీపీ 7.6 శాతానికి పెరగనుందని వెల్లడించింది. ఇదే సమయంలో బ్రిటన్ వృద్ధి ఈ సంవత్సరంలో 1.8 శాతంగా, వచ్చే సంవత్సరంలో 1.1 శాతంగా మాత్రమే ఉంటుందని వచ్చిన అంచనాలు ఆ దేశపు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయని నిపుణులు వ్యాఖ్యానించారు. బ్రిటన్ కరెన్సీ విలువ పతనం కారణంగా జీడీపీ కుంచించుకుపోయిందని పేర్కొన్నారు.