: రజనీకాంత్ కుటుంబానికి తగిలిన నోట్ల రద్దు సెగ


పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సామాన్యులనే కాదు, సంపన్నులను కూడా కష్టాలకు గురి చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబానికి కూడా ఈ సెగ తగిలింది. వివరాల్లోకి వెళ్తే, రజనీ భార్య లత చెన్నైలో ఓ స్వచ్చంద ఆశ్రమ పాఠశాలను నడిపిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ... అందులో పని చేస్తున్న డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దక్షిణ చెన్నైలోని వెలాచెరి ప్రాంతంలో ఈ పాఠశాల ఉంది. పాఠశాల ప్రాంగణంలో దాదాపు 28 మంది డ్రైవర్లు ధర్నాకు దిగడం చర్చనీయాంశం అయింది.

గత ఆరు నెలలుగా నెల చివరి వారంలోనే తమకు జీతాలను ఇస్తున్నారని... పెద్ద నోట్ల రద్దు తర్వాత తమ పరిస్థితి మరింత దయనీయంగా తయారయిందని డ్రైవర్లు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాము ఇంటి కిరాయి ఎలా కట్టుకోవాలని, ఇంటికి అవసరమైన వస్తువులను ఎలా కొనుక్కొవాలని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల మేనేజ్ మెంట్ కు వ్యతిరేకంగా తాము ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు, బ్యాంకులకు వరుసగా సెలవులు రావడం, జయలలిత మృతి చెందడం, వార్దా తుపాను తదితర కారణాలతో జీతాల చెల్లింపులు కొంచెం లేట్ అవుతున్నాయని యాజమాన్యం చెబుతోంది.


  • Loading...

More Telugu News