: మిమ్మల్ని అణచాలంటే నిమిషం పట్టదు.. కేసీఆర్ ఆ రాత్రి నా ఇంటికొచ్చారు!: సీఎల్పీ నేత జానారెడ్డి

తెలంగాణ శాసనసభలో మంగళవారం అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మంత్రి ఈటల రాజేందర్ మాటలను ఆక్షేపించిన సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ‘నా తెలంగాణ కాదు.. మన తెలంగాణ’ అనాలని సూచించారు. దీనికి మరో మంత్రి కేటీఆర్ జానాకు కౌంటర్ ఇచ్చారు. విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు జానారెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుంటే అప్పట్లో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ ఓ రాత్రి తన ఇంటికి వచ్చారని తెలిపారు.

 ‘‘నేను పడుకుని ఉంటే నిద్రలేపారు. ఉద్యమంపై మాట్లాడారు. తెలంగాణను కాపాడుకునేందుకు నేను ఏం కావాలన్నా చేస్తానని ఆయనకు హామీ ఇచ్చా. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని చెప్పా. ఆ కారణంగానే ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. తర్వాత సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణను మీ చేతిలో పెట్టాం. అంత కృషి చేస్తే తెలంగాణ సాధనలో మా పాత్ర లేదంటే బాధేస్తోంది. మా ప్రభుత్వం రాలేదన్న బాధా లేదు, మీకు అధికారం వచ్చిందన్న కసీ మాకు లేదు. అప్పట్లో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. మిమ్మల్ని అణచాలంటే ఎంత పని.. నిమిషం కూడా పట్టదు’’ అంటూ పరుషంగా మాట్లాడారు.

జానారెడ్డి ప్రసంగానికి స్పందించిన కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చి పొరపాటు చేశామన్న వ్యాఖ్యలను జానారెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడింది పార్లమెంటరీ బాష కాదని అన్నారు. ఆయన వయసుకు, హోదాకు అలా మాట్లాడడం తగదని హితవు పలికారు.

More Telugu News