: 'శివ' చూస్తే 'శివ', 'సత్య' చూస్తే 'సత్య', 'సర్కార్' చూస్తే 'సర్కార్' అవ్వాలనిపిస్తాయి!: రేవంత్ రెడ్డి
రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు సమాజం మీద ఎంతో ప్రభావం చూపిస్తాయని తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో 'శివ టు వంగవీటి' వేడుకలో ఆయన మాట్లాడుతూ, వర్మ 'శివ' చూస్తే 'శివ'లా ఉండాలని, 'సత్య' చూస్తే 'సత్య'లా కావాలని, 'సర్కర్' చూస్తే 'సర్కార్' లా ఉండాలని అనిపిస్తుందని అన్నారు. ఆయన తన సినిమాలతో అంత ప్రభావం చూపుతారని ఆయన చెప్పారు.
తాను వచ్చిన దగ్గర్నుంచి వేదికనెక్కినవారంతా 'వర్మ సినిమాలు తీయాలి తీయాలి' అంటున్నారని, ఆయన మానేస్తానని చెప్పారేమో తనకు తెలియదని, ఒకవేళ అలా అంటే కనుక ఎవరూ అంగీకరించరని అన్నారు. 'ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీయాలి...మనమంతా వాటిని ఆదరిస్తూ ఉండాలి' అని ఆయన సూచించారు. 'వంగవీటి' సినిమా యూనిట్ కు శుభాకాంక్షలని, సినిమా అందర్నీ అలరించాలని ఆయన ఆకాంక్షించారు.