: కనిపించని నోట్ల రద్దు ఇబ్బందులు... బీజేపీ కూటమి ఘన విజయం
పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాని మోదీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ విపక్షాలు అధికార బీజేపీపై కత్తులు నూరుతున్నాయి. పలు చోట్ల ప్రజల నుంచి సైతం బీజేపీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 26 స్థానాలకు గాను 21 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం బీజేపీ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘనవిజయం సాధిస్తామని తెలిపారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు.