: హైదరాబాద్‌లోనూ రోడ్లపై ఢిల్లీ తరహా సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టాలి: అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్
హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ... నగరంలోని చార్మినార్ సహా ప్రధాన ప్రాంతాల్లో వాయు, జల, శబ్ద కాలుష్యాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. వీటి వల్ల ప్రజలు ఆస్తమా వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నగరంలో కాలుష్య నివారణకు రాష్ట్ర సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోనూ ఢిల్లీ తరహా సరి బేసి సంఖ్యల కార్ల వినియోగం విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. ఆసియాలో కాలుష్య నగరాల్లో హైదరాబాద్ 24వ స్థానంలో ఉందని అన్నారు. ప్రతిరోజు 600 కార్లు కొత్తగా హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయని తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ తరహాలో వాహనాల నియంత్రణ చేయాలని సూచించారు.
అక్బరుద్దీన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి కేటీఆర్ నగరంలో కాలుష్యం నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వాహనాల నుంచి వచ్చే పొగ ద్వారా 49 శాతం, రహదారుల వల్ల 33 శాతం, బొగ్గు, సిమెంట్ ఇతర మార్గాల కారణంగా మిగతా శాతం కాలుష్యం అవుతుందని చెప్పారు. అయితే, దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో కాలుష్యం తక్కువగానే ఉందని అన్నారు.