: భారత్ బాటలో పాకిస్థాన్... పెద్ద నోట్లను రద్దు చేయనున్న దాయాది దేశం


అనుక్షణం భారత్ పై అక్కసు వెళ్లగక్కే పాకిస్థాన్... మన దేశంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను మాత్రం అనుసరించాలనుకుంటోంది. ఇండియాలో పెద్ద నోట్ల రద్దు అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్న పాకిస్థాన్... తమ దేశంలో చలామణిలో ఉన్న అతి పెద్ద రూ. 5000 విలువైన నోటును రద్దు చేసే దిశగా అడుగు వేసింది. దీనికి సంబంధించి పాక్ సెనేట్ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్)కు చెందిన సెనేటర్ ఉస్మన్ సైఫ్ ఉల్లా ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా... పార్లమెంటు ఎగువసభలో అధిక సంఖ్యలో సభ్యులు ఆమోదం తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేస్తే, బ్యాంకు ఖాతాల వినియోగం పెరుగుతుందని... లెక్కల్లోకి రాని డబ్బు తగ్గుతుందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ లో రూ. 3.40 లక్షల కోట్లు చలామణిలో ఉండగా... అందులో రూ. 1.02 లక్షల కోట్లు రూ. 5000 నోట్లే. అయితే, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నోట్ల ఉపసంహరణ ప్రక్రియను మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో పూర్తిచేయాలని భావిస్తున్నారు.   

  • Loading...

More Telugu News