: టీ అమ్ముకునే వ్యాపారి వద్ద కోట్ల కొద్దీ డబ్బు.. విస్తుపోతున్న అధికారులు!
అతడికి పెద్ద పెద్ద హోటళ్లు లేవు. కేవలం టీ, స్నాక్స్ అమ్ముకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. అయితే, పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఈ మధ్య బ్యాంకులో కోటి రూపాయలకు పైగా బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అతడిపై అనుమానం వచ్చిన అధికారులు అతడి బ్యాంకు ఖాతాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల ఫలితంగా అధికారులు సదరు వ్యక్తి మొత్తం ఆస్తి రూ. 650 కోట్లని గుర్తించారు. వివరాల్లోకి వెళితే... టీ, స్నాక్స్ విక్రయించే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన కిషోర్ భజియావాలా వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఇటీవల అతడు బ్యాంకులో కోటి రూపాయలు జమచేయడంతో అతడి కుటుంబసభ్యులు, సన్నిహితులందరి వద్ద అధికారులు తనిఖీలు చేశారు.
భజియావాలా వద్ద 50 కిలోల వెండి, రూ. 1.39 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 6.5 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయని అధికారులు మీడియాకు తెలిపారు. అతడు వీటన్నింటినీ పలు లాకర్లలో పెట్టి దాచేశాడని, తాము దాదాపు ఏడు రోజుల నుంచి నిందితుడి బ్యాంకు ఖాతాలు, లాకర్లు అన్నింటిపై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం 40కి పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయని చెప్పారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని మరింత నగదు బయటపడవచ్చని తెలిపారు.
సూరత్ శివార్లలోని ఉధ్నా అనే ప్రాంతంలో సదరు నిందితుడు టీ, స్నాక్స్ మాత్రం అమ్ముకుంటుంటాడని, దానితో పాటు ముప్పై ఏళ్లుగా పలు వ్యాపారాలు చేస్తున్నాడని, పదేళ్ల నుంచి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడని, ఈ వ్యాపారంలోనే పెద్ద ఎత్తున సంపాదించాడని చెప్పారు. భజియావాలా సంపాదన నెలకు దాదాపు రూ. 15 కోట్ల వరకు ఉంటుందని, అయితే ఆదాయపన్ను శాఖకు సమర్పించిన రిటర్నుల్లో మాత్రం తాను సంవత్సరానికి కేవలం కోటిన్నర మాత్రమే సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడని తెలిపారు.