chandrababu: ఈ పసుపు చొక్కానే నాకు రాష్ట్రానికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చింది: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పసుపుచొక్కా తొడుక్కున్నానని, ఆ పసుపు చొక్కానే తనకు గుర్తింపు తీసుకొచ్చిందని, రాష్ట్రానికి సేవచేసే అవకాశం ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విజయవాడలోని శేషసాయి కల్యాణ మండపంలో టీడీపీ నేతలు, కార్యకర్తల కార్యగోష్ఠి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగం చేసి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అందరికీ రోజుకి 24 గంటలే ఉంటుందని ఆ సమయంలోనే ఎంత బాగా పనిచేశామనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. మనం ఏం సాధించాలి అనుకున్నాం? ఏం సాధించాం? అనేది ప్రతి మూడు నెలలకొకసారి పరిశీలించుకోవాలని చెప్పారు.
గతంలో తాను ఎన్ని కష్టాలొచ్చినా 208 రోజులు పాదయాత్ర చేశానని చంద్రబాబు అన్నారు. తాను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు కొందరు ఇది అవసరమా? అని అడిగారని చెప్పారు. చివరికి అన్ని ఇబ్బందులు అధిగమించి పూర్తి చేశానని చెప్పారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుందని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పారు. టీడీపీ ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ వస్తుందని అన్నారు. ప్రజలకి మరింత చేరువకావాలంటే నేతలు, కార్యకర్తలంతా మరింత కష్టపడాలని సూచించారు.